25, మార్చి 2009, బుధవారం

ఒక్క మగాడు – ఈడికి ఈడే సాచ్చి : – An introspect

క్రిందటి పుట లో చెప్పినట్లుగా నేను సదురు మగాడి గారిని యాదృశ్చికంగా కలవడం జరిగింది. అలా వారితో కలిసి ఛాయ్ త్రాగే అవకాశం వీరు నాకు కలిగించారు. ఇక అసలు విషయం లోకి వద్దాం. సీన్లో నేను సదురు మగాడు ఎట్ ఛాయ్ సెంటర్..

మగాడు : ఏయ్ చిచ్చా!! దో ఛాయ్, చార్ సమోసా ఔర్ ఆఠ్ బిస్కూట్  లావ్ రే.. బిస్కూట్ పెహలా.. అదిసరే గానీ అడకటం మరిచినా .. నువ్వు ఛాయ్ తాగుతావు గందా!!??

నేను : ఆర్రేరే.. చాయ్ దేముంది.. త్రాగుతా..

మగాడు : గది సరేగానీ.. ఏందీ ఈ మధ్య అమ్మాయిల గురుంచి .. ఏదేదో కూస్తున్నావంట

నేను : అవునండి.. మహిళాల్లో.. (మధ్యలో దూరుకుని..)

మగాడు : నువ్వెవ్వరి గురించి రాస్తే నాకేంటి గానీ..

నేను : దాని వలన మీ అక్క గానీ చెల్లి గానీ భాధ పడ్డారా!!

మగాడు :  హా!! హా!! మనకు చెల్లి గిల్లి .. గసుంటోళ్ళు ఎవ్వరు లేర్.. పురిట్లోనే పిల్ల పుడతాందని తెలిసి మా అయ్య అప్పుడే తీసించేసిండు. మనం బిందాజ్.. దోస్తానలతో మంచిగా ఎంజాయ్ చెయ్యటమే..

నేను : నిజమా!! (ఆశ్చర్యపోవడం నా వంతైంది)

మగాడు : గది సరేగానీ.. ఏందీ గెప్పుడు చూసినా అమ్మాయిల గురించి పీకుడేనా.. మన మొగోళ్ళ గురించి కొంచం కూడా కూసుడు లేదా..

నేను : సరైన మగాడు దొరకలేదండి. దొరకగానే ఆ పనిమీదే ఉంటాను..

మగాడు : ఆడెవడో దొరకడం లేదే అని ముడుసుకుని కూచ్చోకపోతే.. నేను లే.. నన్ను సేసుకో..

నేను : ఏంటి చేసుకునేది?

మగాడు : గదే బై.. తుంటర్వూ..

నేను : ఓ.. అలా వచ్చారా.. సరే.. మీతోనే మొదలు పెడతాను

మగాడు : గది గిప్పుడు నచ్చినావ్ నాకు .. మర్ద్ హోతో మేరే జైసా..

..

ఇంతలో సమోసా వచ్చింది.. అవి తింటూ, నేను నా పనిలో పడ్డాను..

..

నేను : మరి ఇక అసలు విషయానికి వద్దాం. మీరు నా ఇండాలు గురించి చదివారా!!

మగాడు : లేదు బై.. గానీ, మనకున్న కొద్ది మంది దోస్తానాలోని ఓ పోరి సదివిందంట.. తెగ నవ్వుకుని, నీ గురించి సెబుతాంటే ఇని, నీకు సానా కిలాసు పీకాలని గిట్లొచ్చినా..

నేను : నాకా !! క్లాసా!! ఎందుకంటారు??

మగాడు : బై.. నీకు తెల్వదనుకుంటా.. అమ్మాయిలు చానా మంచోళ్ళు. ఆళంత మెత్తని మనసున్న మనుషులు నీకెక్కడ కనబడరు. నువ్వన్నట్లు ఆళ్ళని పడేయ్యాలంటే ఆళ్ళు చేశే ఏషాలు కాదు, మనం మగాళ్ళు చేసే పనులే..

నేను : అంటే.. నాకు అర్దం కాలేదు.. అబ్బాయిలు వాళ్ళ వెంట పడేది వాళ్ళ ఎక్స్ ‍పోజింగ్ వల్ల కాదంటారా..

మగాడు : ఖచ్చితంగా.. ఆళ్ళు ఒక్కడితో డిసైడ్ అయ్యారంటే, ఎంత మంది ఆళ్ళ చుట్టూ తిరిగినా ఏదో టైమ్ పాస్ అనుకుంటారే తప్పితే.. మిగిలిన ఇషియాలలో సానా స్టిట్టు. గానీ మనదేముంది, ఇప్పుడు ఇది.. కాసేపైన తరువాత మరొక్కత్తి.. ఆ తరువాత ఇకొక్కతి. ఇలా ఎంత మంది కావాలంటే అంత మంది .. మనల్ని ఆడిగేదెవరు చెప్పు..

నేను : అంటే అర్దం కాలేదు .. కొంచం వివరంగా చెబుతారా..

మగాడు : అలా అడిగావ్ బాగుంది. సరిత్రలో ఒక్క ఆడదానికి మాత్రమే కట్టుబడ్డ మగాడికి పట్టిన గతి ఏంటో తెలుసునా..

నేను : లేదండి..

మగాడు : పోని అట్లాంటి మగాళ్ళు ఎవ్వరో చెప్పగలవా..

నేను : అంటే.. పురాణాలలో ఒక శ్రీరాముడు.. చరిత్రలో ఒక్కరేమిటి చాలా మంది ఉన్నారు..

మగాడు : ఈళ్ళందరూ అస్సలు నిజంగా ఉన్నారో లేదో తెల్వదు గానీ.. నాకు తెలిసినంత వరకూ ఓ మజ్నూను చూడు.. అలాగే ఓ దేవదాసుని చూడు.. ఇలాంటి వాళ్ళ గతి ఏమైంది? పోరీలేమో మాంచిగా పెళ్లిళ్ళు సేసుకుని కాపురాలు సాగించటంలే.. గానీ ఆళ్ళు పెళ్ళిళ్ళు సేసుకున్న తరువాత గీ పోరగాళ్ళని పిలిసి మంచిగా రెండు ముక్కలు సెప్పి.. అరే బై ఇకమీద నువ్వు నేను దోస్తానా చేద్దాం అంటే.. ఇనక రోడ్డెక్కి గోల సేసేది ఎవ్వరు?  

నేను : ఆ!!! (ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందా..)

..

ఇంతలో ఛాయ్ వచ్చింది.. ఒక్కో బెస్కెట్ వేడి వేడి ఛాయ్ లో ముంచుకుని తాగుతుంటే.. ఆహా.. అనిపించింది.. ఇంత కాలం ఈ రుచిని ఎలా మిస్ అయ్యానా అనిపించింది..

..

మగాడు : పాపం.. ఆళ్లు ఏ పరిస్తితులలో అట్లా సేసిండ్రో అని ఎవ్వుడైనా ఆలోసిస్తుండ్రా.. గంతెందుకు బై.. మాగాడైతే ఎంత మంది పెళ్ళాలనైనా ఉంచుకోవచ్చా.. కానీ ఆడది మాత్రం ఒక్కడికే పరిమితం అవ్వాలా.. ఇలా సెప్పింది ఎవ్వర్? మనం మగాళ్ళం కాదా.. పాపం ఆళ్ళు కూడ పానీపురి కట్లెట్ తింటాండారు కదా..

నేను : పానీపురి కట్లెట్ !!! ???

మగాడు : అదే.. ఉప్పు కారం అని నా ఉద్దేశ్యం. ఆళ్ళకీ కొద్దో గొప్పో కోర్కెలు ఉంటాయి గందా.. మరి ఆటిల్ని గురించి ఎవ్వుడైనా పట్టించుకుంటుండా.. లేదే..

నేను : అవుననుకోడ్రి.. ఛా.. ఏందిది.. నేనుకూడా మీలాగే మాట్లాడుతున్నాను..

మగాడు : హా.. హా..

నేను : అంటే తప్పంతా మగాళ్ళదే అంటారా..

మగాడు : గిక్కడ తప్పొప్పులగురించి మనకు అనవసరం బై.. నేను సెప్పొచ్చేది ఏంటంటే.. అమ్మాయిలు సానా మంచోళ్ళు ఆళ్ళ గురించి తప్పుగా రాయ మాక. ఆళ్ళంత అమాయకమైనోళ్ళు మనకు దొరకరు. అమ్మాయిల బాచ్ అంతా అంతే.. శివయ్యని అంటారే.. అదేందది..

నేను : భోళా శంకరుడు అని..

మగాడు : అదే.. అచ్చంగా ఈళ్ళు అంతే.. వఠ్టి భోళ్ళా మనుషులు.. ఈళ్ళ గురించి నీకు తెల్వదు బై.. నువ్వెప్పుడైనా ఏదైనా పోరిని పటాయించి నావా..

నేను : అబ్బే లేదండి..

మగాడు : ఒక వేళ్ళ పటాయించి నావనుకో.. ఎలా పటాయిస్తావ్..

నేను : నేనెప్పుడూ పటాయించలేదే..

మగాడు : ఓ చిట్కా సెబుతా ఇనుకో.. ఆళ్ళని పొగుడుతూ ఓ నాలుగు లైన్ల కవిత్వం రాయి అంతే.. పోరి ఖలాస్.. ఖుష్ అయ్యి నీ ఒల్లో వాలిపోద్ది

నేను : నాకా .. కవిత్వమా.. రాదే..

మగాడు : వచ్చేదేముంది.. అదేదో సినిమాలో నాగార్జున కస్టాలు పడతాడే.. రాజు గారిని నువ్వది పీకావో.. నువ్విది పీకావో అని కవిత్వం సెప్పలేదని.. ఆలెక్కలో నువ్వు కూడా ప్రయత్నం సెయ్యి..

నేను : అంటే కవిత్వం లో కూడా పీకడం చెయ్యాలా..

మగాడు : ఓ పది పదాలు సెబుతా ఇనుకో.. అందం సెంద్రుడు.. కోపం సూరీడు.. నవ్వు ఎన్నెల.. దూరం ఇరహం.. పువ్వులు సరసం.. ఇలాంటి వాటిల్ని వాడేస్తూ ఎదో ఒకట్ రాసేయ్.. గంతే నిన్ను గుడ్డిగా నమ్మేస్తది.. అంతే.. నీ పని గట్లా ముగించుకో ఆ తరువాత పిలేటు పిరాయించేయ్..

నేను : పాపం కదండీ..

మగాడు : కొంత కాలం ఏడుస్తారు.. ఆ తరువాత కాలం మనల్ని మర్చి పోయేట్టట్టు సేస్తాది. ఆళ్ళకు బొత్తిగా లోకం తెల్వదు బై.. ఎవ్వురైనా గింత మంచిగా మాటాడారో గంతే.. ఆళ్ళు మనోళ్ళనుకుంటార్.. ఎవ్వుడు మంఛోడో.. ఎవ్వడు దొంగ నాయాలో ఈళ్ళకి తెల్వదు. అంతెందుకు బీహార్ లో మొన్నామధ్య చదువులు సెప్పే ప్రొఫెసరు సారు లేడు .. గదే బై.. మతుక్ నాద్ చౌదరి.. గాడు సూడు.. మంచిగా పెళ్ళి సేసుకుండు.. ఇద్దరు పిల్లల్ని కనిండు.. సాలేగాడు .. గీ వయసులో మరో పోరిని పటాయించినాడు. మరి ఆ పిల్ల తెలిసి తెలిసి గీ ముసలోడ్ని ఎలా సేసుకుందంటావ్? అన్నీ మాయ మాటలు బై..

నేను : అవుననుకోండి..

మగాడు : అనుకో.. గినికో .. అది తీసి పక్కల బెట్టు.. గీరోజుల్లో పెళ్ళైన ఆడోల్లు ఎంత మంది ఉద్యోగాలు గట్రా సేత్తాండ్రు.. గాళ్ళు మాత్రం పొద్దుగాల్నే లేవాల్నా.. మొగుడుకి నాస్తా సేసి పెట్టాల్నా.. ఉన్నదేదో కూతంత తినేసి పొలో మంటూ ఉద్యోగానికి పోవాలా .. మళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత.. ఇంటెడు చాకిరీ చెయ్యాల్నా వద్దా.. పోనీలే చేదోడుగా ఉంటాదని పని పిల్లని పెట్టుకుందనుకో మన మగాళ్లం ఎట్టా రియాక్ట్ అవుతాం..

నేను : ..

మగాడు : బోడి అఫీస్ లో పొడిచేసిందేంటంట.. ఇంట్లో పనిపిల్లని పెట్టుకున్నావ్.. దానికి జీతం దండగ..

నేను : ..

మగాడు : అదంతా వద్దు బై.. ఏనాడైనా మన మగాళ్ళు.. నాజీతం ఇంత.. నేను ఈ జీతంతో ఫలానా ఫలానా పనులు చేస్తున్నా అని పెళ్ళాలకి సెబుతారా.. పైగా .. సంపాదీంచే పెళ్ళాం ఉంటే.. దాని జీతం కూడా నాకే కావాలంటాడు..

నేను : ..

మగాడు : ఉల్టా.. ఏదైనా కొనుక్కోవాలంటే పర్మీషన్ లేందే ఊరుకోమాయే.. మరి ఇంతగా ఇంసిత్తున్నమే.. ఏనాడైనా .. ఒరేయ్ నాయాల్ది.. అని మనల్ని తిట్టిండ్రా.. లేదే.. ఆడెవడో సెప్పినాట్లు.. ఆడది అమ్మోరు ఆవు అన్నీ ఒకే రకానికి సెందినోళ్ళు.. గడ్డి లాంటి పనికి రాని వాటిల్ని కూడా తిని పాలల్లాంటి పనికొచ్చే పౌష్టికరమైన వి మనకు ఇస్తారు.. కాస్తంత తెలుసుకో..

నేను : అవునండి..

మగాడు : గది సరే గానీ .. గీ విషయాలన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కి గిట్టా తెలియజేయ మాక.. నా పని కొల్లేరౌతాది..

నేను : అలాగే

మగాడు : మరి నేను ఉంటాను.. నా నాలుగో పోరిని కలిసే వేళ్ళైంది..

నేను : నాలుగో పోరి అంటున్నారు.. ఎంత మంది ఉన్నారే..

మగాడు : దాదాపు ఓ డజన్ టచ్ లో ఉన్నారు.. ముగ్గురితో టిపినీలు అయ్యాయి.. ఓ పోరి దాదాపు లంచ్ కి రెడీ.. ఇక టైమ్ అండ్ ప్లేస్ కోసం సూత్తున్నా..

నేను : ఇంత మందిని ఎలా ..

మగాడు : ఏముంది.. ఇందాక సెప్పినట్లు .. ఏ పోరి దగ్గరకు పోయినా ఒక్కాటే మాట.. నువ్వొక్కత్తివే నా లైఫ్ లో .. అంతే గదే నిజమ్ అనుకుంటారు .. మనకి మాత్రం పని గడవాల్న .. సరేగానీ ఇక ఉంటా, అవతల్న నా కోసం అక్కడ పోరి వెయిటింగ్.. ఒరే చిచ్చా.. సార్ దగ్గర పైసల్ తీసుకొ భే..

నేను : హా!!!!


ఈ పుట ఏదో హాస్యాస్పదంగా ఉంటుందని మాత్రమే మొదలు పెట్టాను.. అంతే గానీ ఎవ్వరినీ ఉద్దేశ్సించి కాదని నా మనవి

23, మార్చి 2009, సోమవారం

ఒక్క మగాడు – ఈడికి ఈడే సాచ్చి : An introduction

మొన్నా మధ్య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సదురు మహిళను తుంటర్వూ చేసిన తరువాత పెట్టిన ఇండాలు, అలా చాలా కాలంగా మాఇంట్లోనే ఉంటే, ఏమీ తోచక వాటిల్ని దగ్గరలో ఉన్న కాలువలో కలపడానికి బయలుదేరాను. అదిగో అప్పుడే వచ్చింది తళ్ళుక్కుమని ఓ ఆలోచన.

కాలువ నుంచి తిరిగి వస్తూ ఎలా మొదలు పెడదామా అనుకుంటూ వెళ్ళుతున్నంతలో.. ఓ ద్విచక్ర వాహనం దుమ్ములేపు కుంటూ వచ్చి నా ముందు ఆగింది.

దానిమీద ..

తైల సంస్కారం లేని చింపిరి జుట్టు.. చెవులకు లోలాకులు.. మూతిమీద మీసాలులేవు కాని పెదవి క్రింద ఓ అంగుళం వెడల్పులో గడ్డం.. ముంజేతికి రంగు రంగుల తాళ్ళు.. బ్రొటన వ్రేలికి సత్తు ఉంగరం.. పూలపూల చొక్కా.. బుడబుక్కలోడు వేసుకునేటటు వంటి అతుకుల బొంత లాంటి గోనెపట్టాని తలపించే జీన్సు పాంటు..

అబ్బా!!! ఈ ఆకారానికి వర్ణించడానికి మాటలు చాలటం లేదంటే నమ్మండి. ఇలా ఆలోచనలో తడబడి నిశ్చేష్టుడనై నిల్చొని ఉంటే.. ఆఆకారం నన్ను అడుగుతోంది..

హెల్లో!!! ఇక్కడ భవదీయుడు అని బ్లాగులు గీకుతాడంట ఎరుకనా..

ఈ మాటలకు ఒక్క సారి మూర్చ వచ్చినంత పనైంది. అంతలో తేరుకుని.. హతవిధీ, వీడేమిటి.. ఈ గీకుడేమిటి అని మనసులో అనుకుంటూ..

నేనేనండి.. ఆ భవదీయుడను.. మరి మీరు? అన్నాను

ఆ ఆకారం ఫక్కున నవ్వి..

గదేంది బై.. గాడెవడో బవదీయుడంటే.. ఛే ఫూట్ ఉంటాడు.. గింతింత మీసాలతో, ఫైల్ వాన్ లెక్క ఏ ఎయిట్ పాక్కో టెన్ పాక్క్ లతో తురుప్ ఖాన్ లెక్కన ఉంటాడనుకుంటుంటే.. గిదేంది లొట్టిపిట్ట లెక్కన గింతున్నావు?? పేరేంటన్నావ్?

.. నన్ను .. (ఏదో అనబోతూ ఉంటే.. మధ్యలో కలిపించుకుని.. )

నువెట్టుంటే నాకేంది గానీ.. నేనెవురంటివి గందా.. నన్ను మొగాడంటార్లే.. పద, కనబడతాందే ఆ ఛాయ్ దుకాణంలో కెల్లి కొంచం పిచ్చా పాటి ఏసుకుందారి.

గత్యంతరం లేక.. ఇది కూడా మనకి ఏదో విధంగా పనికివ్స్తుందిలే అనుకుంటూ మగాడు అని పిలిపించు కునే ఆకారం వెనకాలే వెళ్ళాను. అక్కడ జరిగిన సంభాషణను మరో పుటలో వివరంగా.. అంత వరకు మా సంభాషణ ఎలా సాగి ఉంటుందో ఊహించి స్పందించ గలరు

9, మార్చి 2009, సోమవారం

మహిళా దినం - ఇండాలు


ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్బంగా, ఓ వింత పేరడి చేసే ప్రయత్నంలో ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదని గమనించగలరు. ఇది ఒక తుంటర్వూ మాత్రమే అని బ్లాగు పూర్వకంగా తెలియ జేసుకుంటున్నాను.


మహిళా దినోత్సం సందర్బంగా ఓ సాధారణ మహిళని తుంటర్వూ చేస్తే ఎలా ఉంటుందని అనిపించి, ఆంద్ర ప్రదేశ్ లోని ఓ సాధరణ గృహిణిని కలిసాను. ఆవిడతో సాగిన తుంటర్వూ లోని కొన్ని ముఖ్యాంసాలు..

నేను : నమస్కారం.. మహిళ గారూ..

మహిళ : నమస్కారం భవదీయుడు గారూ.. అలా నిలబడ్డారే, కూర్చోండి ఇప్పుడే వస్తాను. లోపల డిక్కు డిక్కు టీవీ వారు నిర్వహిస్తున్న డొక్కు డొక్కు వంట అనే కార్యక్రమం వస్తోంది. అయ్యిన తరువాత వస్తాను

నేను : మరి ఇప్పుడు ..

మహిళ : ఆ అర్దం అయ్యింది, అక్కడ బ్రేక్.. ప్రకటనలు వస్తున్నాయి..

నేను : కాస్త మంచి నీళ్ళు ఇస్తారా!!

మహిళ : ఆ.. తరువాత బ్రేక్‍లో ఇస్తాను (హా!! మూర్ఛ వచ్చినంత పనైంది నాకు..)

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇవిగోండి.. మంచి నీళ్ళు

నేను : మంచిదండి. అదిసరే కానీయండి, ఇవ్వాళ్ళ మహిళా దినోత్సవం కదాండి.. (ఇంకా అనబోయ్యేంతలో..)

మహిళ : అయితే ఏమిటండి.. ఎవ్వరికి కావాలండి ఈ దినాలు?? ఇండాలు??

నేను : ఇండాలా!! అవేంటండి?

మహిళ : తద్దినం నాడు పెట్టేది పిండాలైతే, ఇలాంటి దినాల నాడు పెట్టేది ఇండం

నేను : అర్దం కాలేదండి కొంచం వివరించ గలరా..

మహిళ : అలాగే.. తద్దినం లోంచి ’తద్’ తీశేసారనుకోండి అది దినం అవుతుంది, అలాగే పిండం లోంచి ప తీసేయ్యండి.. అంతే.. అదే ఇండం

నేను : బాగుందండి, ఇక అసలు విషయానికి వద్దాం.

మహిళ : ఆ.. అదిగో బ్రేక్ అయినట్లుంది.. ఇప్పుడే వస్తాను..

నేను : !!!

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : హా.. ఇప్పుడు చెప్పండి..

నేను : మరి ప్రపంచం మొత్తం ఈ రోజున ఏవేవో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా!! మరి మీరు ఈ దినాన్ని ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు?

మహిళ : నాకు తెలియక అడుగుతాను, ఒక్క మాట సూటిగా సమాధానం చెప్పండి.. అస్సలు, స్త్రీలకంటూ ఒక రోజు కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్పండి?

నేను : అది కాదండి!! ఇది ఎప్పటినుంచో వస్తున్న అలవాటు కదా అని, ఏదో అడగ బోయ్యాను..

మహిళ : మహిళలకు ఒక రోజు అంటూ సంవత్సరం మొత్తం కాదని చప్పకనే చెప్పినట్లు చెబుతున్నారే..

నేను : అంటే, మీరు అపార్దం చేసుకుంటున్నారండి..

మహిళ : అపార్దం కాకపోతే మరి ఏమిటిది.. సంవత్సరానికి ఒక్క సారే నిర్వహించే తద్దినంలా, ఈ మహిళా దినం ఏమిటి?

నేను : అది .. సంవత్సరం లో ఒక్కసారే వచ్చే, ఒక పుట్టిన రోజు లాంటిది.. ఓ పెళ్ళి రోజు లాంటిది.. ఇంకా ఇలాంటి వాటిల్లాగానే ఇది కూడా..

మహిళ : మరి ఈ దినాన్ని .. మహిళా రోజు అనవచ్చు కదా..

నేను : అనవచ్చు ..

మహిళ : ఇప్పుడే వస్తా.. అక్కడ ప్రకటనలు అయినట్లున్నాయి

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇందాకేదో చెబుతున్నారు..

నేను : అదండీ.. మీతో వాదిస్తున్నాననుకోకండి.. మీరి అలా ఆలోచించకుండా.. ఆగస్టు 15ని స్వాతంత్ర దినం అని.. అలాగే గణతంత్ర దినం.. ఇలా మరిన్ని ఉన్నాయి కదా.. వాటిల్ని మనం వక్ర దృష్టితో చూడడం దేనికి.. చక్కగా మంచిగా చూడవచ్చుకదా..

మహిళ : నిజమే అనుకోండి. నేను ఇండాక అడిగినట్లు.. ఇలాంటి దినం కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్ప గలరా!!

నేను : లేదండి..

మహిళ : నన్ను చెప్ప మంటారా.. ఇది కూడా మరో మగాడే సృష్టించి ఉండాడని నా గట్టి నమ్మకం

నేను : అయ్యుండ వచ్చు. ఏది ఏమైనా మహిళలకూ ఒక దినాన్ని కేటాయించడం ఎంతైనా మంచిదే కదా. ఈ విధంగా నైనా మహిళలకు ఒకరకమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది.. దాని ఆవశ్యకత ఎంత ఉందో అందరికీ తెలుస్తుంది.. (ఆవేశంగా ఇంకా అనబోయ్యేటంతలో..)

మహిళ : హల్లో భవదీయుడు గారూ.. ఒక్క నిమిషం .. మీరు నేల మీద ఉన్నారు.. ఆ విషయం మర్చి పోకండి. మీరు ఏ స్టేజీ ఎక్కి ప్రసంగం చెయ్యటం లేదు.. కాసిన్ని మంచి నీళ్ళు త్రాగండి

నేను : ..!!

మహిళ : అయినా మాకేం.. తక్కువందనీ మీరు అంత ఇదై పోతున్నారు. చక్కగా తిండి పెట్టడానికి మొగుడున్నాడు, చెత్తో బొత్తో .. మన టీవీలలో సెంటిమెంటు సీరియళ్ళకు కొదవ లేదు. పండగలో పబ్బాలో వచ్చాయంటే .. వచ్చే పోయ్యే చుట్టాలతో బాతాకాణీ కొట్టడానికే సమయం చాలటం లేదు

నేను : మరి ఆర్దిక స్వాతంత్ర్యం కావాలి కదా..

మహిళ : ఎవ్వరికి కావాలి?? మాకా!!! ఎందుకు? మాదగ్గర డబ్బులున్నాయి అనుకోండి, ఉన్నంత లోనే సర్దు కోవాలి. ఆ డబ్బులే లేవనుకోండి, నచ్చింది కొని పెట్ట లేదని కట్టుకున్న వాడిని చక్కగా పలు విధాలుగా రాచి రంపాన పెట్టేయ్యచ్చు. ఒకవేళ అడగంగానే కొని పెట్టారనుకోండి.. ఇంకేం పండగే, అడిగినప్పుడల్లా కొని పెడుతూనే ఉంటాడు అనుకోండి అంతకన్నా కావాల్సిందేముంది?

నేను : మరి మీ వ్యక్తిత్వం..

మహిళ : ఇంకే వ్యక్తిత్వం వికాశం.. అదేదో సామెత చెప్పినట్లు. అబ్బాయి సార్దకుడు అయ్యాడని ఎప్పుడు చెబుతామో చెప్ప గలరా..

నేను : .. అన్ని అవసరాలకు సరిపడేంత సంపాదించే చక్కని ఉద్యోగం ఉండి .. సుగుణవంతుడై..

మహిళ : అంతే కాకుండా.. స్తోమత కలిగిన కుటుంబం నుంచి ఆస్తిపాస్తులు గురించి మర్చి పోకండి..

నేను : హా!!

మహిళ : అలాగే ఓ అమ్మాయి సార్దకురాలు ఎప్పుడవుతుందో తెలుసా..

నేను : .. (ఇంకా ఆశ్చర్యం లోనే..)

మహిళ : పైన చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకున్నప్పుడు. అదే వ్యక్తిత్వం.

నేను : మరి మీకంటూ రుచులు .. అభి రుచులు..

మహిళ : అందుకేగా.. ఈ వంటా వార్పు… చక్కగా మాకు నచ్చినది చేసుకుంటాం.. ఆ రోజు నచ్చలేదనుకోండి.. చక్కగా బయట నుంచి తెప్పించుకుంటాం..

నేను : మరి మీ వారు ఒప్పుకుంటారా..

మహిళ : వారు ఒప్పుకునేది ఏముంది.. నాబొంద!! చేసిన వంటలో కొంచం ఉప్పు ఎక్కువ వేశాం అనుకోండి.. ఉప్పు ఎక్కువైందని ఓ నాలుగు కేకలేసి, వారే తెప్పిస్తారు. మొగుడు అనే మూర్ఖుడు ఉన్నది ఎందుకనుకున్నారు? ఉండండి.. అదిగో ప్రకటనలు అయ్యినట్లున్నాయి.. ఇప్పుడే వస్తాను..

..

.. కొంత సేపయ్యాక ..

నేను : మీరంటే పెళ్ళైన వాళ్ళు.. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ అభిప్రాయం ఏమిటో!!

మహిళ : అవునండీ.. నేనూ చూస్తున్నాను. పాపం.. అవన్నీ స్వయంకృతాపరాధాలు.. ఇలాంటి అత్యాచారాలు చేసే అబ్బాయిలను ఎలా గుర్తించాలి వాళ్ళనుండి ఎలా తప్పించు కోవాలి అనే విషయాలను ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాలి. ఆ పధాంలో ఇవ్వాళ సాక్షి ఆదివారం స్పెషల్ లో మన హైదరాబాద్ అమ్మాయి సానియా మిర్జా ఇంటర్వూని ప్రతీ అమ్మాయి చదవాలి. అందులో ఓ నూతన సంవత్సరం నాడు సానియాకు జరిగిన సంఘటన లో ప్రతీ అమ్మాయికి ఓ మంచి చిట్కా దాగి ఉంది.

నేను : అదేమిటో మీ మాటల్లో చెప్పగలరా..

మహిళ : ముందుగా ప్రతీ అమ్మాయి గుర్తు పెట్టుకోవల్సినది.. అమ్మాయి స్నేహితుల సంఖ్య కన్నా స్నేహితులు అనిపించుకునే అబ్బాయిల సంఖ్యే ఎక్కువ ఉండేటట్లు ఛూసుకోవాలి. చొంగ కార్చుకునే అబ్బాయిలే వాళ్ళ పాలిట వరం .. వారే వీరికి రక్ష. అప్పుడప్పుడు వీళ్ళ కళ్ళకు విందు కలిగించేలా, జెబ్బలు లేని జాకెట్లో లేక టీషర్ట్ ‍లో వేసుకుంటే చాలు.. అలాగే పొట్ట కనిపించే పొట్టి కుర్తాలో.. పిఱలు కనిపించేలా లోహిప్ జీన్సో వేసుకుంటే చాలు.. బెల్లం చుట్టూ ఈగల్లాగ చచ్చినట్లు మనచుట్టూ తిరుగుతూ మన బాడీకి జీతం లేని వాచ్ మెన్స్‍ గా ఉండి పెడతారు.

నేను : మరి పెళ్ళి విషయానికి వస్తే..

మహిళ : దానికి కొత్తగా వచ్చేదేముంది!! ఇందాక చెప్పినట్లు, ఆనీ ఉన్న ఓ బకరా గాడిని మన పెద్దలు ఎలాగో మనకు కట్ట బెడతారుగా.. ఒకవేళ మన పెద్ద వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ చప్పగా ఉన్నాయనుకోండి, మన చిరంజీవి గారి చిన్న కూతురు చేసినట్లు.. ఎవ్వడో ఒకడు గుడ్డిగా ప్రేమ దోమ అనకపోడు.. వాడితో ఎంచక్కా కొన్ని సంవత్సరాలు గడిపేయ్యవచ్చు. ఆ తరువాత నచ్చలేదనుకోండి, పుట్టిల్లు ఎలాగో ఉండనే ఉందిగా.. మన ప్రమోద్ మహాజన్ కొడుకు రాహుల్ మహాజెన్ భార్య స్వేత మనకి ఇలాంటి వాటిల్లో ఆదర్శం

నేను : మరి ఆ తరువాత భవిష్యత్తు??

మహిళ : ఏముంది మన హీరోయిన్ గౌతమీ చేసినట్లు, ఇద్దరు పెళ్ళాలను వదిలెసిన రెండో పెళ్ళి వాడైన కమల్ హాసన్ లాంటి వాడు దొరక్క పోడు.. వాడి వల్ల గౌతమీ ఈ మధ్య తల్లి కాబోతోందని పుకారు.. అలా ఏదో ఒక అక్రమ సంబందం సక్రమం కాకపోదు. ఇలాంటి వాటిల్లో మన రేణుకా దేశాయ్ ని చూడండి. చక్కగా కలసి కాపురం చేసుకుని పిల్లల్ని కని వాళ్ళ పేరు మీద శుభలేఖలు కొట్టించేయ్యచ్చు. ఇంత స్వాతంత్ర్యంగా మేము బ్రతికేస్తుంటే.. మాకేదో పెద్ద నష్టం జరిగి పోతున్నట్లు ఏదేదో వాగేస్తున్నారే..

నేను : అంటే మీ ఉద్దేశ్యంలో మహిళా దినోత్సవం అక్కరలేదంటారా..

మహిళ : వద్దని అనను కానీ మరీ ఒక్కరోజే పెట్టే బదులు సంవత్సరంలో కనీసం ఓ ఆరు నెలలు మాకంటూ కేటాయిస్తే బాగుంటుంది అంటాను..

నేను : ఇచ్చాం.. అనుకోండి.. ఏమి చేస్తారు?

మహిళ : నేను చేసేది ఏముంది.. అస్సలు.. మహిళా దినం అనేది ఒకటి కావాలి అనే మహిళలను అడగండి వాళ్ళు చెబుతారు

నేను : కనుక చదివే చదువరులందరికీ ఒక విన్నపం. మహిళా దినం అనేది ఒకటి కావాలా?? దాని ఆవశ్యకత ఏమిటో? అలాంటి దినం వల్ల మీరు సాధించేది ఏమిటో? అలాంటి రోజుని ఒక పండుగగా ఎందుకు చేసుకోవాలో సదురు మహిళకు తెలియ జేస్తారని మనవి

మహిళ : ఏంటీ మీ బ్లాగుని మహిళలు కూడా చదువుతారా!!

నేను : అవునండి

మహిళ : చూద్దాం!!! మీ మహిళా బ్లాగర్లు ఏమి చెబుతారో..

నేను : అంతైనా.. అదేదో పాటలో చెప్పినట్లుగా.. ఆడాళ్ళూ!!! మీకు జోహార్లు..

మహిళ : ఏయ్!! ఏంటి!! అప్పుడే మమ్మల్ని ఫోటోలో పెట్టి గోడ కెక్కించేస్తున్నారు

నేను : నేనా..

మహిళ : కాదా మరి .. జోహార్లు ఎవ్వరికి చెబుతారు!!


ఈ పుటని హాస్యస్పదంగా తీసుకుంటారని ఆశిస్తాను.

7, మార్చి 2009, శనివారం

మంత్రాలయం : యాత్రా విషేశాలు


మా మంత్రాలయ మొదటి భాగం విషేశాలు చదివారు కదా.. ఇదిగో ఇప్పుడు మరికొన్ని. శనివారం రాత్రి అలా మంత్రాలయం రైల్వే స్టేషన్‍లోని విశ్రాంతి గదిలో (రిటైరింగ్ రూమ్) బస. అక్కడ ఆది వారం తెల్లవారింది. అదిగో అప్పుడు మెల్లగా మగతగా గుర్తుకు వచ్చింది రాత్రి ఎవ్వరో వచ్చారు, ఏదో అడిగారు, దానికి నేను ఉదయం ఏడు గంటలకల్లా తయారయి ఉంటానని చెప్పినట్లు. సరిగ్గా అప్పుడు చేతికి ఉన్న వాచీ చూద్దును కదా తెల్లావారి బారెడు ప్రొద్దెక్కి చక్కగా ఆరు గంటల ఇరవై నిమిషాలైంది. వామ్మో!! రాత్రి వచ్చిన వాళ్ళు ఠంచనుగా ఏడు గంటలకు వచ్చేస్తారు అనుకుంటూ.. గబగబా స్నాన పాన ఇత్యాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఖశ్చితంగా ఏడు గంటలకు సిధ్ధమై బాల్కనీ లోకి వచ్చి నుంచున్నాను. ఏదీ ఎవ్వరూ కనబడరే!!! అనుకుంటూ మెల్లగా క్రిందికి వెళ్ళి ఓ ఛాయ్ కొట్టి వస్తానని శ్రీమతికి చెప్పి బయలు దేరాను. మీకు తెలియని దేముంది, ఆడాళ్ళు తయ్యారవ్వటం అంటే మాటలా!! అధమ పక్షం ఓ గంటకు తక్కువ కాకుండా ఉంటుందా అనుకుంటూ క్రిందకు వెళ్ళి ఓ ఛాయ్ త్రాగి వచ్చాను. అక్కడ కాఫీ అడిగితే, బడ్డీ కొట్టు వాడు కొంచం వింతగా చూశాడు, నేనేదో ఇతర గ్రహం నుంచి వచ్చి అడగ కూడనిది ఏదో అడిగినట్లు కూడనిది అడిగినట్లు. ఇంతలో ట్రంగ్.. ట్రంగ్.. అంటూ నా ఫోన్ మ్రోగింది. ఎవ్వరా!! అనుకుంటూ.. ఆన్సర్ చేసాను. అటు వైపు నుంచి, ’సార్ .. వచ్చేస్తున్నానండి.. సత్యసార్ చెప్పారు’ అంటుంటే, నోట మాట రాక, ’సరే నండి .. ఇక్కడే ఎదురు చూస్తున్నా ..’ అని ఫోన్ పెట్టేశా.

ఇక్కడ మరో విషయం చెప్పాలి, ఇందాక చెప్పినట్లు ఇంతులు తయారవ్వడానికి గంట కావాలన్నానా. అందుకు విరుధంగా ఇరవై ఐదు నిమిషాల కల్లా నా శ్రీమతి తయారై గిన్నిసు బుక్కు రికార్డు బద్దల కొట్టిందనుకోండి. ఇలా ఏడు ఇరవై ఐదు అవుతుండగా మరో పెద్దాయన వచ్చి మమ్మల్ని కలిసారు. మాటల్లో వారిపేరు రాఘవేంద్ర అని అర్దం అయ్యింది. (వారి అసలు పేరు ప్రచురించటానికి అనుమతి లేక ఇలా..). చాలా మర్యాదస్తులు. ఎంత మర్యాదస్తులంటే, ముందుగా వీరిని మర్యాద రామన్న అని పరిచయం చేద్దాం అనుకునేంత. కానీ రాఘ వేంద్ర అని అంటే బాగుంటుందనిపించి అలా మార్చేసాను. మొదటి భాగంలో సత్యన్నారాయణ శర్మ గారు చెప్పిన కొన్ని మాటలు ఒక్క సారి నెమరు వేసు కుందాం..

..విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు ..

అది సంగతి, సత్యన్నారాయణ శర్మ గారు చెప్పినట్లుగా, ఈ రాఘవేంద్ర గారే ఆ సదురు వ్యక్తి అన్నమాట. రాత్రి వచ్చిన ఫ్రకాశ్ గారిని ఈయనే పురమాయించి ఉంటారని అప్పుడు అర్దం అయ్యింది. సదురు రాఘవేంద్ర గారితో పిచ్చాపాటీ వేసుకుంటూ చిన్నగా స్టేషన్ బయటకు వచ్చి అక్కడి ప్రకృతిని ఆశ్వాదిస్తూ అక్కడే పచార్లు కొడుతూ ఉన్నంతలో, రాఘవేంద్ర గారు మన ప్రకాశ్ కోసం ఫోన్‍లో ప్రయత్నిస్తున్నారు. మన ప్రకాశ్ ఏమో స్పందించడం లేదు. అలా అక్కడే ఎనిమిది గంటలైంది. మేము మనసులో పడే ఇబ్బందిని తొలగించాలనే ప్రయత్నంలో చక్కటి కాఫీ ఒకటి పోయించి కొంచం చల్లార్చారు. పదే, పదే చేసిన ప్రయత్నాలలో ఒకటి కలిసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే, ప్రకాశ్ గారి తండ్రి గారికి ఆ రోజు ఉదయమే శుస్తి చేసిందని. అందువల్ల తండ్రిగారికి సపర్యలు చేసే నిమిత్తమై ప్రకాశ్ గారు ఇఱుక్కు పోయ్యారని. హతవిధీ!! ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నంతలో,

“ఇక్కడే, ప్రక్కనే మంత్రాలయ దేవస్థానం వారి ఆశ్రమం ఉంది అది చూసి వద్దాం పదండి .." అని రాఘవేంద్ర గారు అనడంతో అటు బయలు దేరాము. అలా అక్కడికి ప్రక్కనే ఉన్న ఆశ్రమం చూసుకుని అక్కడ మరో గంటన్నర గడిపిన పిదప మన ప్రకాశ్ గారు ఆటోతో సహా వచ్చారు. చక్కగా ఆటో ఎక్కి మంత్రాలయం వైపు బయలు దేరాము.



మెల్లిగా ఓ అరగంట ప్రయాణం చేసిన పిదప మంత్రాలయం ఆలయం చేరుకోవడం ఆటో నడిపే వ్యక్తి చక్కగా మమ్ములను గుడి ద్వారం దగ్గరకి చేర్చడం అన్నీ అనుకోని విధంగా జరిగి పోయ్యాయి.సరి అని కాళ్ళకున్న చెప్పులు కాస్తా ఆటోలో వదిలి చేతిలో ఉన్న కెమెరా శ్రీమతి చేతి సంచిలో ఉంచి అడుగులో ఆడుగు వేసుకుంటూ మ్రెల్లిగా గుడిలోపలికి చేరుకున్నాం. అదిగో అప్పుడు తెలియలేదు మాకు అక్కడి గర్బ గుడిలోకి మేము వెళ్ళి వస్తామని.

లోపలికి వెళుతూ .. అచంగా పుష్కరం క్రిందట విచ్చేసినప్పటి నా అనుభవాలను ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా నా శ్రీమతితో పంచుకుంటున్నాను. క్రిందటి పుటలో దీప్తిధార చీమకుర్తి భాస్కర రావుగారు స్పందించినట్లుగా.. నా జీవితంలో మొట్ట మొదటి సారిగా మ్రొక్కులు ఎంత వెరైటీగా ఉంటాయో ఈ దేవాలయం లోనే చూసాను. అలాగే మ్రొక్కులు తీర్చే క్రమంలో భక్తులకు ఎన్నెన్ని గాయాలౌతాయో ప్రత్యేకంగా ఈ కళ్ళతో వీక్షించాను. అలా ఆ రోజు నేను మాత్రమే కాకుండా నా భార్య కూడా సాక్ష్యం పలికింది. ఎవ్వరికి అనుకుంటున్నారా.. మ్రొక్కులు తీర్చుకునే వాళ్ళకి.

లోపలకి వెళ్ళిన తరువాత ప్రకాశ్ అడగనే అడిగారు, పంచ కండువా తెచ్చుకోలేదా అని. ఒక్క శ్రీశైలం మరియూ కాళకస్తి గుళ్ళలోనే ఇలా పంచ కండువాతో మాత్రమే రానిస్తారని తెలుసు కానీ ఇక్కడ కూడ అలాగే వెళ్ళాలని తెలియనందుకు కొంచం సిగ్గు పడ్డాను. నా సంకట స్థితిని గమనించిన మన ప్రకాశ్ అక్కడే ఉన్న పంతులు గారి దగ్గరకు తీసికు వెళ్ళి కండువా ఒకటి దానమిప్పించారు. ఇక పంచె విషయాన్నికి వస్తే తన కండువాని నాకు చేబదులిచ్చి లుంగీగా కట్టుకోమన్నారు. అదిగో అలా చొక్కా పాంట్ పోయి పంచా కండువా వచ్చాయి. అలా ఆహార్యం మార్చి వీఐపీ ద్వారం గుండా ఒకసారి దర్శనం చేసుకుని, మరోసారి గర్బ గుడిలోకి ప్రవేసించే అవకాశం ఏ జన్మ పుణ్యమో కదా అనుకుంటూ ఈ పుటని ఇక్కడితో ముగింపు పలుకుతాను. మరో పుటలో మరిన్ని వివరాలు.

అంత వరకూ సెలవా మరి.

ఇట్లు భవదీయుడు

1, మార్చి 2009, ఆదివారం

బ్లాక్ – ద కలర్ ఆఫ్ మ్యూసిక్

ETV వారు నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలలో శీర్షికలో తెలియజేసిన పేరు మీద ఒక కార్యక్రమం ప్రతీ శని వారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమౌతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, పాడే వాళ్ళంతా అంధులే. ఆఖరికి వీరిని మరియు వీరి ప్రతిభా పాఠవాలని బేరీజు వేసే న్యాయ నిర్ణేతలలో ఒక్కరు కూడా అంధులే అంటే నమ్ముతారా. ఇక అసలు విషయానికి వస్తాను.

ఈ కార్యక్రమానికి ఝాన్సి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటే, సినీ నటి లయ మరియు సినీ గేయ రచయత అనంత్ శ్రీరామ్ మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మూడో న్యాయనిర్ణేత మురళీ కృష్ణ గారు ఎవ్వరో నాకు అంతగా తెలియదు, కావున వారి గురించి ప్రస్తావించడం భావ్యం కాదు. ఈ పుట ప్రచురించడనికి ప్రేరేపణ మన హీరోయిన్ లయ గారు. ఈవిడ చేసే కామెంట్లే నన్ను ఈ పుట వ్రాయడానికి ప్రేరేపించాయంటే నమ్ముతారా.. అలాగే వీటికి తోడుగా క్రిందటి వారం కార్యక్రమంలో నిష్క్రమించిన తేజాలక్ష్మి అనే అమ్మాయి మాట్లాడిన తుది పదాలు నన్ను లోలోపల్నుంచి .. (అంటే గుండె లోతుల్లోంచి అన్న మాట..).. .. .. .. .. .. .. .. … .. .. ఏమి వ్రాయాలో మాటలు రావటం లేదు. ఎక్కువ సుత్తి వెయ్యకుండా .. ఆమె మాటలు యధా విధిగా…

ఝాన్సి : తేజా లక్ష్మి.. మరి ఈ ఎపిసోడ్ నుంచి నువ్వు ఎలిమినేట్ అయ్యవు. ఇక్కడితో నీ ఈ ప్రయాణం ఆగి పోతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు!!!???

(ఏమిటిది అడగడం??? ఎంత సీనియర్ యాంకర్ అయితే మాత్రం ఓడిపోయిన వాళ్ళని అడిగే ప్రశ్నేనా ఇది?? ఏదో కప్పు గెలిచావు అన్న లెక్కలో ఓడిపోయ్యావు ఎలా ఫీలవుతున్నావు అని అడుగుతావా అనిపించింది. అందునా మామూలుగా ఉండే వాళ్ళను ఏదైనా కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు అడిగితే వారు ఎంత భాద పడుతూ కంట నీళ్ళు పెట్టు కుంటారో చాలా కార్యక్రమాలలో చూస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి అందునా చూపు లేని ఈ పిల్ల ఎలా స్పందిస్తుందా అని భాద పడుతూ.. దేవుడా !!! ఈ పిల్లని ఏడ్పించకు అని మనసులో మ్రొక్కుకుంటుంటే.. ఈ అమ్మాయి స్పందన ఈ క్రింది చిధంగా ఉంది)

తేజా లక్ష్మి: గెలుపుని ఎంతగా ఆస్వాదించానో ఓటమినీ అంత ఆస్వాదిస్తున్నాను. రెండింటిల్లో పెద్ద తేడా ఏమీ లేదు..

ఇలాంటి స్పందన విన్నందుకు నాకు ఎగ్గిరి గెంతెయ్యాలనిపించింది. ఎంతో పరిపక్వం చెందిన వ్యక్తిత్వం నాకు ఆ మాటల్లో కనబడింది. ఇలాంటి కార్యక్రమాలనుంచి వైదొలుగుతున్న వారు తప్పని సరిగా కంట తడి పెట్టుకోవడం మనకు సర్వ సాధారణంగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది, అంధు రాలైన తేజా లక్ష్మి కొంచం కూడా తొణకకుండా, బెదర కుండా, ఎంతో గొప్ప మనసుతో ఎటువంటి భాధ కనబడ నీయ్యక ఇచ్చిన సమాధానం నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది.

ఇక మన హీరోయిన్ లయ గారి విషయానికి వస్తే, ఈ పుట వ్రాసే సమయానికి జరిగిన కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తనలో కొంచం పరిపక్వం కనబడుతోంది. అంతకు ముందు ఎపిసోడ్‍లలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తన చాలా అసందర్బంగా సాగింది. ఎలా అంటారా!! కళ్ళు లేని లోకాన్ని ఒక్క సారి ఆలోచించ కోండి. అలాగే హావ భావాలకు ప్రధానం కళ్ళు. అట్లాంటి కళ్ళతో మనం తెలియకుండా ఎన్నో విషయాలను ఎదుటివారికి తెలియ జేస్తుంటాము. కధాకళి నాట్యానికి ప్రాణం ఈ కళ్ళు మరియు వాటితో పలికించే అనేక భావాలు. కళ్ళు ఉన్న మనకే ఒక్కొక్క సారి ఎదుటి వారిని అనుకరించడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది కళ్ళతో చూడకుండా ఎదుటి వారిని అనుకరించాలంటే అందునా ఎదుటివారి మాటల్ని మాత్రమే వింటూ యధావిధంగా పాడాలి అన్నది ఎంత వరకూ సుళువో ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.

ఇంత కష్ట తరమైన కళలో వీరి వంతు కృషి వీరు చేస్తూ చాతనైనంత బాగా పాడాలనే ప్రయత్నం చేస్తుంటే, మన హీ(జీ)రోయిన్ లయ గారు అందరు గాయకులకు ఒకటే స్టాండర్డ్ కామెంట్.. ఏమిటంటే.. మీరు పాడిన పాటలోని ఫీలింగ్ మిస్ అయ్యినట్లు ఉంది. మీరు కొంచం బాగా పాడొచ్చు. ఎక్స్ ప్రషన్ ఇంకా ఉంటే బాగుంటుంది.ఎక్స్ ప్రషన్ విషయంలో కొంచం ఎక్కువ శ్రద్ద తీసుకోండి

ఇట్లా ఈవిడ గారి స్పందనలు సాగుతింటే.. నామనసులో ఈ క్రింది విధంగా అనిపించింది.

తొక్కలో ఎక్స్ ప్రషన్.. అస్సలు చూపే లేని వారికి ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? ఒక వేళ తెలిసిందనుకుందాం, కళ్ళు లేని వారికి సదురు పాటను పాడిన వారి ఎక్స్ ప్రషన్ ఎలా కనబడుతుంది? నవ రసాలలోని హాస్యం మరియు విషాదం తప్ప మరేమీ తెలియని అంధులకు మిగిలిన రసాలను ఎలా అర్దం చేసుకుంటారు? ఒక వేళ అర్దం చేసుకున్నా వాటిల్ని ఇలా వ్యక్తం చేయ్యాలని ఎలా తెలుస్తుంది? ఈవిడగారు నటించేటపుడు ప్రతీ షాటు ఎన్ని సారు రీటేక్‍లు చేసేదో ఈవిడగారు మర్చి పోయినట్లున్నారు. న్యాయనిర్ణేతగా వచ్చేటప్పటికి ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలియకుండా.. ఆ స్థానానికి తగ్గ హుందాతనంతో ప్రవర్తించ కుండా ఇలాంటి కామెంట్లు చేస్తే.. పాడాలనే హుషారు ఉన్న గాయకులకు సదురు ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో తెలియక నిరుత్సాహ పడిపోరా? ఈ విషయం మన హీ(జీ)రోయిన్ గారికి ఎలా తెలుస్తుంది?

ముగించే ముందుగా మఱో విషయం. ఇక్కడ పాడే వారిలో కొంత మంది పాట పాడుతూ హుషారుగా పాటలో ఎంతగా లీనమై పోతున్నారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఝాన్సీ వీరిని తీసుకు వచ్చి కెమెరా ముందు నిలబెడితే, పాటలో లీనమై పోయి పాడుతు పాడుతూ వీరు మఱో ప్రక్కకి తిరిగిపోతూ ఉంటుంటే ప్రక్కనే న్రుంచున్న ఝాన్సీ వీరిని మళ్ళీ కెమెరా వైపుకు త్రిప్పాల్సి వస్తోందంటేనే అర్దం అవుతోంది వీరు ఈ పాటలను ఎంతగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పాడుతున్నారో. ఈ చిన్ని విషయం మన లయగారికి అర్దం అయినట్లు లేదు. ఇంతక ముందు ఈవిడ గారి మీద ఉన్న గౌరవం కాస్తా ఇట్లాంటి స్పందనలతో తుడిచి పెట్టుకు పోయింది.

ఏది ఏమైనా మీకు వీలైతే తప్పని సరిగా మీరు చూడదగ్గ కార్యక్రమం. మీరు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగిందా.. మరి మీస్పందనలు ఏమిటో నాతో పంచుకుంటారా?

అంత వరకూ సెలవు,
ఇట్లు,
భవదీయుడు

 
Clicky Web Analytics