6, నవంబర్ 2010, శనివారం

భాగ్యనగరంలో బ్లాగు ప్రమదలు

భాగ్యనగరంలోని బ్లాగు ప్రమదలన్నీ ఈ రోజు అక్కడేక్కడో కలుసుకుని ఏదేదో చర్చించుకున్నారు. ఈ విషయం నాకెలా తెలిసింది అని అడుగుతున్నారా!! మరేం లేదండి. ఇవ్వాళ ప్రొద్దునే నా భార్య ఓ చిన్న గిన్నెలో గుప్పెడు బియ్యం ఉడకేసి వాటికి జతగా ఓ నాలుగు బెండకాయల్ని వేయించి అక్కడ పెట్టి నేను బయటకు వెడుతున్నా, నాకు బండి కావాలి అని అడిగింది. ఏంటబ్బా తనకి ఇంత అవసరం అని మనసులో అనుకుని, సరే గాని ఎక్కడికి వేళుతున్నావ్ అని అడిగా. అదిగో అప్పుడు పేలింది మొదటి తూటా.

ఏం? మీకు చెప్పాలా.. మా ఆడోళ్ళంతా ఓ చోట చేరి మా కష్ట సుఖాలు పంచుకోకూడదా.. అన్నీ మీకు చెప్పే చెయ్యాలా..

ఆ సౌండ్ కొంచం తేడాగా ఉంటే, శాంత తల్లీ మనం ఈ విషయమై మళ్ళీ చర్చించుకుందాం అని అప్పటికి దాటేశాను. కానీ నాకు కూడా బండి కావాల్సి వచ్చినందున, నేను దింపుతాలే అని ఓ స్టిల్ ఇచ్చా. మాటైతే ఇచ్చాను కానీ ఏమి జరుగుతోందా అన్న ఆలోచన బ్యాక్‍గ్రౌండ్ లో తిరుగుతోంది. ఆ ఆలోచన అలా తిరుగుతూ ఉండగా మెల్లిగా బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకు వద్దాం అని బయలు దేరాం. రెండో తూటా పేలే ముందు కొంచం గింగిరాలతో ఫ్లాష్ బ్యాక్..

మాకు పెళ్ళి కాక ముందు వరకూ నా భార్యది చాలా చిన్న ప్రపంచం అని చెప్పవచ్చు. అందరి ఆడపిల్లలలాగా చాలా  గారాబంగా పెరిగింది, చదువుకున్నంత సేపు ఇల్లు కాలేజీ తప్ప మరో ప్రపంచం ఎరగదు. విజయవాడలో వాళ్ళ ఇల్లు ఉన్న ఏరియా, దుర్గాపురం మరియు గాంధీనగర్ లోని శాతావాహన కాలేజీ వైపు తప్ప మరో ప్రదేశం తెలియదు. ఈ రెండు కాకుండ, ఏలూర్ రోడ్డులో విజయటాకీస్ నుంచి కాంగ్రెశ్ ఆఫీస్ రోడ్డు వరకు కొంచం తెలుసు. అంతకు మించి ఏమి తెలియవు. ఓ డొక్కి సైకిల్ తొక్కుకుంటూ బొంగరం తిరిగినట్టు దుర్గాపురంలో ఉన్న వాళ్ళ స్నేహితుల ఇళ్ళకు మాత్రం వెళ్ళి వచ్చేది.

పెళ్ళికి ముందు మా అత్తగారు నాభార్య గురించి ఓ డైలగ్ కొట్టారు. మీరు కొంచం దారి చూపించండి ఇకపై తాను అల్లుకు పోతుందని. సరే ఏదో అన్నారు కదా అని అప్పట్లో మా అమ్మ వాడే లూనా నేర్పించాను. ఫరవాలేదు ఒక్క సారి నేర్పగానే పట్టేసింది. సైకిల్ తొక్కడం ద్వారా వచ్చిన బాలెన్స్ చెయ్యడం ఉపయోగ పడింది. ఎలాగో వచ్చు అనిపించిన తరువాత తనకి అంటూ ఓ బండి ఉంటుంది కదా అని హోండా వాడి ఏవియేటర్ కొనిచ్చా. ఆ తరువాత మేము ఎక్కడికి వెళ్ళినా తననే డ్రైవ్ చెయ్యమంటాను. ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే అంత ఎక్కువ అలవాటౌతుందని దాని వెనకాల ఆంతర్యం. మొదట్లో తాను కొంచం భయపడినా, పోను పోను నేర్చుకుంది. మొత్తం మీద హైదరాబాద్ అంతా కాకపోయినా దాదాపు ప్రధాన ప్రదేశాలన్నీ తనకి తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే, విజయవాడ కన్నా హైదరాబాదే ఎక్కువ తెలుసు అని చెప్పొచ్చు.

మా పెళ్ళి కాకముందు నాకు ఓ ఆలోచన ఉండేది, భార్యగా వచ్చే నా అర్ధాంగికి నేను మాత్రమే ప్రపంచం కావాలి అనుకోకుండా, తనకి అంటూ ఓ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా, తనది అంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి అనుకునే వాడిని. అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు. అదిగో అలాంటి ఘటనే ఈ నాటి ఈ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇవ్వాళ అక్కడ చేరే ప్రమదలలో ఒక్కరు కూడా నా భార్యకి చుట్టరికం ఉన్న వాళ్ళు కాదు. అక్కడి వారు ఇటు నావైపు భందువులు కారు అటు తనవైపు చుట్టరికం ఉన్న వారు కాదు. బ్లాగు పెట్టి తనకు నచ్చిన సోది వ్రాసుకుంటూ మిత్రులైన తోటి బ్లాగర్లతో కలసి ఓ ఫుల్ నూన్ ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యింది అంటే, ఆ ప్రపంచంలో నేను లేను కానీ ఆ బ్లాగు పెట్టడానికిన్ నేనే కారణం అనేది నాకు ఆనందానిస్తోంది.

ఇక రెండో తూటా విషయానికి వద్దాం, ముందుగా ఎర్రగడ్డ రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చాం. అప్పుడు కూడా నా భార్యే డ్రైవర్. వెళ్ళాం, వచ్చాం. బాగానే జరిగింది. అప్పుడు కూడా నేను వెనకాలే కూర్చున్నా. ఇంతకాలం నేను వెనకాలే కూర్చున్నా లేని అనుభూతి ఇదిగో ఇప్పుడు ప్రమదలందరినీ కలిసేందుకు వెళుతుంటే కలిగింది. అదే భయం. ఎందుకంటారా, ఎప్పుడూ లేని హుషారు ఒక్కసారిగా కనబడింది. బండి నడుపుతుంటే, అది కాస్తా ఏ మాత్రం స్పీడ్ తగ్గదే. నా పై ప్రాణాలు పైనే పోయ్యాయి అంటే అది అతిశయోక్తి కాదు. ఎలాగో గుండె చిక్కబట్టుకుని వెనకాల కూర్చున్నా. కూర్చున్నా అన్న మాటే గాని వెనకనుంచి ఒకటే సణుగుడు. ఒక టైంలో తనకి విసుగు పుట్టి ఇంకెక్కువ మాట్లాడావో ఇక్కడే దింపేస్తా అని అల్టిమేటం ఇచ్చింది. దాంతో ఇక మనం సైలెంట్. అలా రెండో తూటా ఓ పావుగంట సతాయించగానే వీళ్ళు కలుసుకోవాల్సిన ప్రదేశం వచ్చింది. బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయట పడగానే చూడాలి నా మొఖంలోని రిలాక్స్, వర్ణనాతీతం.

అలా బ్లాగు ప్రమదల సమావేశం ఈ నాడు నాకు రెండు హార్ట్ ఎటాక్స్ ఇచ్చింది. మనకేమైనా వివరాలు లీకైతే, మీకు మరో పుటలో చెబుతా, అంత వరకూ అంతా ఉష్.. గప్ చుప్..

6 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

భార్యగా వచ్చే నా అర్ధాంగికి నేను మాత్రమే ప్రపంచం కావాలి అనుకోకుండా, తనకి అంటూ ఓ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా, తనది అంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి. అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు.
Appreciable Thoughts.

Krupal kasyap చెప్పారు...

నైశ్..నైశ్.. .. నేను ఒక సారి ప్రయత్నించా .. కాని మా అమ్మకు కంప్Yఉటర్ రాదు , నా భార్యకు తెలుగు భాగా రాదు . నాకు నేర్పించ రాదు

కొత్త పాళీ చెప్పారు...

మొదటి అజ్ఞాత వ్యాఖ్యని సమర్ధిస్తున్నాను.
బంధువులు - భందువులు కాదు.
This is one of your best.

చక్రవర్తి చెప్పారు...

మొదటి అజ్ఞాత గారు,

మీ మెచ్చుకోలుకు ధన్యవాదములు.

కశ్యప్ గారు,

మీరు ఎంత భోళా మనిషండి. ఏమైనా మీ మనోభావాన్ని తెలియజేసినందులకు నెనరులు

కొత్తపాళిగారు,

ఈ బంధం గురించి ఇంతకు ముందు ఒక సారి చర్చ జరిగింది. అయినా నాకు బుద్ది రాలేదు. ఇకనైనా వస్తుందో చూడాలి, సరిదిద్దినందులకు నెనరులు. అలాగే మెచ్చుకున్నందులకు ధన్యవాదములు

జ్యోతి చెప్పారు...

తనకి అంటూ ఓ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా, తనది అంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి. అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు.

మంచి మాట కమల్.. స్వాతి కూడా చాలా సంతోషంగా ఉండింది మా సమావేశంలో. అప్పుడప్పుడు ఇలా కుటుంబాన్ని వదిలి తనకంటూ ఏర్పరుచుకున్న ప్రపంచంలోకి వెళ్లనివ్వాలి..

చక్రవర్తి చెప్పారు...

జ్యోతి గారు,

ఇదిగోండి ఇక్కడే వచ్చింది చిక్కంతా, నా భార్యకి ఇక్కడ తెలిసిన వారు చాలా తక్కువ. ఉన్నదంతా చుట్టాలే తప్ప మరెవ్వరూ లేరు. ఉన్న ప్రమదావనం కెలుకుడు గాళ్ళకు భయపడి ప్రత్యక్ష కార్యక్రమాలలో పాలు పంచుకోవటం లేదు. ఏదైనా కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటే, తప్పని సరిగా నేను ఉండాలి. అన్ని సార్లు నేను ఉండను కదా. అది నా భాధ. ఫైనల్ గా ఇదిగో ఆలస్యంగా నైనా ప్రమదలు మేల్కొన్నారు. ఇకనైనా మీరందరూ సంఘటితంగా ముందుకు సాగుతారని ఆశిస్తాను. స్పందించి మీ మనోభావాన్ని తెలియ జేసినందులకు నెనరులు. ఇలాగే మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను

 
Clicky Web Analytics