24, ఆగస్టు 2011, బుధవారం

తెలుగుబాట లో పాలు పంచుకుందాం

telugubaata

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.


ఇది తెలుగు బాట లంకెలో  ఉన్న సమాచారం. కానీ దీనికి ఓ చక్కటి పుట వ్రాద్దాం అని ఆలోచిస్తూన్నంతలో నామాల మురళీధర్ గారు ఓ చక్కని లేఖవ్రాసారు. దానిని యధాతధంగా ఇస్తేనే నా మనసుకు తృప్తి.

 


ఆత్మీయులైన తెలుగుబ్లాగు మిత్రులకు,

e-తెలుగు సంస్థ తెలుగుబాటలో పాల్గొనవలసినదిగా సాదర ఆహ్వానంపలుకుతుంది. తామంతా పాల్గొనటమే కాక ఈ ఆహ్వానాన్ని మీమిత్రులందరితో పంచుకుని, తెలుగుబాటలో అత్యధికులు పాల్గొనటంలో మీసహాయాన్ని అందించవలసినదిగా కోరుతున్నాం.

 

అమ్మ అనే మాటతో మొదలయ్యి, నాన్న వేలు పట్టుకుని ఊ కొడుతూ, తాత పాడే పద్యాలను వల్లె వేస్తూ, బామ్మ చెప్పే కధలతో ఊహల రెక్కలు సంతరించుకునిమూర్తీభవించిన వ్యక్తిత్వాలని అందించిన కమ్మని అమ్మ తెలుగు.  లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లోచెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష తెలుగు. “దేశభాషలందు తెలుగులెస్స” అని పొరుగువారు కీర్తించిన కమ్మని భాష తెలుగు. అంత గొప్ప భాషకు, సంస్కృతికి వారసులమైన మనం మన అమ్మ వంటి భాషనేనిర్లక్ష్యం చేస్తున్నాం.  ఆంధ్రమహాభారతాలు, ఆంధ్రభాషాపదకోశాలు ఏనాడో అటకెక్కి చెదలుపట్టాయి. తెలుగుభాషకున్న అనంతమైన సాహితీ సంపదను భావి తరాలకి అందించే వారధులు కరువయ్యారు.కాస్తో కూస్తో మిగిలి, నోటిలో నానిన నీతిశతకాలకి ఇప్పుడు మనం మంగళంపాడేసాం. కారణం బ్రతుకుతెరువుకు అక్కరకురాని భాష అయిపోయింది తెలుగు.

 

జీవితమంటే కేవలం బ్రతుకుతెరువే కాదు. బ్రతుకు తెరువు చూపటం లేదని చెదలు పట్టించెయ్యడానికి భాష అంటే కేవలంఒక అక్షరమాల, గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం. ఆ జాతి జీవలక్షణం, అంతర్లీనంగా మెదిలే జీవశక్తి. అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగామిగిలిపోవటమే. మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్నిచాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమనిప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

 

తెలుగు ప్రజలందరినీచైతన్యవంతం చెయ్యటానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయసంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో అందరికీ వీలుగా ఉండేందుకుఆదివారం నాడు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. తెలుగు లలిత కళాతోరణంనుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువనుప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతఅందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటడానికి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మనభాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని మహోద్యమంగామారుద్దాం.


కృతజ్ఞతలతో,

e-తెలుగు.


ఎంత చక్కగా వ్రాసారో అనిపించి ఇక్కడ ఉంచుకుంటే, ఇలాంటి డ్రాఫ్ట్ నాకు మున్ముందు పనికి వస్తుందనిపించింది

20, ఆగస్టు 2011, శనివారం

భద్రాచలం – మఱో ఙ్ఞాపకం

DSCN2500వెళ్ళిన వెంటనే లగేజి సత్రంలో ఉంచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రక్కనే ఉన్న గోదావరిని చూచి వచ్చిన తరువాత ఆలశ్యం అవుతోందని, తొందరలో అయ్యవారి దర్శనార్దం వెళ్ళాము. తీరా దేవాలయం దగ్గరకి వెళితే, అయ్యవారు కొండెక్కి కూర్చున్నారు. ఆ మాత్రం కష్టపడక పోతే అయ్యవారి దర్శనం కలగదులే అని అనుకుని, మెల్లగా ఒక్కోఅడుగు ముందుకు వేసుకుంటూ కనబడుతున్న మెట్లెక్కడం మొదలు పెట్టాను.

భక్తులలో చాలా రకాలు ఉంటారు కదా, వారిలో అయ్యవారిని తొందరగా దర్శనం చేసుకునే హడావిడి ఉన్నవారికి నాలా నత్తలా నడుస్తున్న వారు కనబడక పోవడం వల్ల కొంచం చికాకు వేసినా, నా స్థితికి నేను సమాధానం ఇచ్చుకుని పరుగులెత్తేవారికి దారివ్వడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నా అదృష్టమో లేక అది సహజమో కానీ సర్వదర్శనానికి ఎవ్వరూ లేరు, అందరూ ప్రత్యేక దర్శనానికే మక్కువ చూపుతున్నారు. అందుకని మేము కూడా ప్రత్యేక దర్శనానికే టికెట్టు తీసుకుని దర్శనార్దం వరుసలో నిలబడ్డాం. మెల్లగా ఒక్కొరొక్కరూ ముందుకు సాగుతుంటే, గర్బాలయంలో కూర్చొని ఉన్న అయ్యవారిని దర్శించుకునే అవకాశం రానే వచ్చింది.

చక్కగా సీతమ్మను ఎడమ తొడపై కూర్చొని ఉంచుకున్న  శ్రీరాముడుని చూడటానికి నా కన్నులు చాలలేదంటే నమ్మండి. ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నా కళ్ళ ముందు నిలిపివేసిన ఆ క్షణాన్ని ఏమని చెప్పాలి. వీరిద్దరినే చూద్దాం అనుకున్నంతలో వీరి ప్రక్కనే నిలబడ్డ లక్ష్మణ స్వామి నా దృష్టిని ఆకర్షించారు. ఆవిధంగా సీతమ్మ సమేతుడైన శ్రీరాముడుని మఱియు లక్ష్మణ స్వామిని దర్శించుకున్న తృప్తి వర్ణనాతీతం. అలా సాగి ఆలయం బయటకు వచ్చిన మాకు ఆ ప్రక్కనే పులిహోర ప్రసాదంగా లభించింది. అది తింటూ చుట్టూ చూస్తుంటే, శ్రీరామదాసు కాలం నాటి ఆభరణాలను ఉంచిన మ్యూజియం కూడా దేవాలయ ప్రాంగణంలో ఉంచడం కొంచం ఆశ్చర్య పఱచినా, ఇది బాగానే ఉందనిపించింది.

వింతైన విషయం ఏమిటంటే, అయ్యవారిని చూడటానికి ఎంత మంది బారులు తీరారో అంతకు రొండింతలు ఇక్కడ కనబడ్డారు. దానికి ప్రవేశ రుసుముగా రెండు రూపాయలు దేవస్థానం వారు ఎందుకు విధించారో నాకైతే అర్దం కాలేదు కానీ ఆ విధంగా నైనా కొంత ద్రవ్యం అయ్యవారి ఖాతాకు జమా అయ్యి ఎంతో కొంత మొత్తం భక్తుల సౌకర్యార్దం ఉపయోగపడుతుందనుకుంటాను. ఇక్కడ మఱో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయ్యవారి ఆలయం ప్రక్కనే కళ్యాణం చేస్తున్నారు. అక్కడ కళ్యాణం చేయించుకునే దంపతులు అందరూ ఆసీనులై ఉన్నారు. వారితో సమానంగా మనమూ కూర్చునే వీలున్నా మేము మాత్రం ఓ ప్రక్కగా కూర్చుని కళ్యాణాన్ని తిలకిద్దాం అని అనుకుని అనువైన చోటుకోసం వెతుకుతుంటే, మా అదృష్టమో ఏమో కానీ వేదం చదువుకుంటున్న విఙ్ఞులు మా కంట పడ్డారు.

అధర్వ వేదం చదువుకుంటున్న ఓ మహానుభావుని వద్దకు చేరుకుని మమ్ములను మేము పరిచయం చేసుకుని వారి క్షేమ సమాచారాలు తెలుసుకి కొంత సేపు సజ్జనులతో గడిపాము. ఇంతలో అక్కడ వరుసలో ఎవ్వరూ కనబడకపోయేసరికి, నా భార్య మఱో సారి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుని వస్తానన్ని వెళ్ళి చక్కగా రెండోసారి దర్శన భాగ్యం కలిగించుకుంది. ఇలా సాగింది ఆ రోజు ఉదయం. అక్కడి నుంచి మెల్లగా రూముకి చేరుకుని, బట్టలు మార్చుకుని సత్రంలో భోజనం కోసం వెళ్ళాం.

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

5, ఆగస్టు 2011, శుక్రవారం

షుగర్ వ్యాధి గ్రస్తులకు శుభవార్త

మా అమ్మ షుగర్ వ్యాధితో చాలా కాలంగా బాద పడుతూ దానికి సంబందించిన మందులను వేళ తప్పకుండా వేసుకుంటూ అలా వేసుకోవడానికి అలవాటైపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎండాకాలంలో చక్కగా మామిడి పళ్ళు తినాల్సి వస్తే, చక్కగా ఓ రొండు షుగర్ టాబ్లెట్లు వేసుకుని తృప్తిగా మామిడి పళ్ళు లాగించేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే, మా అమ్మ పరిస్థితి చాలా బాలెన్సుడ్ గా సాగుతోందనే చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్య ఎందుకు చేసానంటే, ఇలా షుగర్ వ్యాధి భారిన పడిన వారిలో మా పిన్ని కూడా ఉన్నారు. కాకపోతే మా పిన్నిది కొంచం ఎడ్వాన్సుడ్ స్టేజ్ అని చెప్పుకోవాలి. మా చిన్నాన్న పిన్ని ఓ మారు మూల ప్రాతంలో ఓ చిన్న గ్రామంలో ఉంటున్నారు. అలాంటి గ్రామానికి వైద్యుడు ఎప్పుడో చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి స్థితిలో మా పిన్ని షుగర్ వ్యాది ఎంత ముదిరిందంటే, ప్రస్తుతం తాను రోజు ఇన్సులెన్ ఇంజెక్షన్ చేసుకుంటుంది. ఇలాంటి వారిని చూసిన తరువాత, తిండిపై కొంచం శ్రద్ద పెరిగింది. జన్యురీత్యా వస్తే చెప్పలేను కానీ తినే పదార్దాల ద్వారా, లేదా తినే హాబిట్స్ ద్వారా మాత్రం నేను షుగర్ వ్యాధిన పడకూడదనుకుంటున్నాను. ఇదంతా ప్రస్తుతం వ్రాయబోయే విషయానికి ఉపోద్ఘాతం అయితే, చెప్పబోయే విషయం కొంచం శుభ సూచకమే అయినా, కొంచం ఇబ్బంది కరం.

shudev

స్కాట్ హన్సల్ మెన్ అనే వ్యక్తి శాంకేతి పరంగా చాలా విద్వత్తు ఉన్న వ్యక్తి. క్రొత్తగా ఏది విడుదలైనా ముందుగా వాటి గురించి తెలుసుకుని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తి నిన్న ఓ విషయం గురించి బ్లాగారు. అదే షుగర్ వ్యాధి గ్రస్తులకు నేను తెలుసుకున్న శుభవార్త. ఆ విషయం గురించి నేను ప్రస్తావించే ముందు, స్కాట్ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, క్రొత్తగా వచ్చే డివైజస్ వాడటం ద్వారా శత్రువులకు అధునాతన పరికరాలు ఉపయోగించి హత్య చేసే అవకాశం ఉందే అనేది ఒఠి అపోహ అని. ఈ విషయం విశదీకరంగా వ్రాసే ముందు, ప్రస్తుతం ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు మరో అధునాతనమైన పరికరం ఓ వరంలా దొరికింది అని చెప్పుకోవాలి.

పైన నేను ఉదహరించిన మా పిన్ని లాంటి వారికి అనునిత్యం ఇంజెక్షన్ చేసుకోకుండా, ఇదిగో ఇక్కడ చిత్రంలో చూపించినట్లు ఓ చిన్న సూదికలిగినటు వంటి పరికరాన్ని మన శరీరానికి తగిలించుకుని ఉంటే చాలు. మన శరీరంలో గ్లుకోజ్ పాళ్ళు అటు ఇటు అయ్యినాయి అని అది గుర్తించగానే సరిపడే పరిమాణంలో సమతౌల్యానికి తెచ్చే ప్రయత్నం ఈ పరికరం చేసేస్తుంది అనేది ముఖ్యాంశం. అందువల్ల షుగర్ వ్యాధి గ్రస్తులు వారి వారి గ్లూకోజ్ గణణాంకాలను గమనించుకోవలసిన పనిలేదు. ఈ పరికరం గురించి వివరించే ప్రయత్నంలో స్కాట్ ఓ విడియో కూడా చేసారు.

ఈ విడియో చూసిన తరువాత నాకు కొంచం బాధ మరికొంచం బాద్యత పెరిగిందని చెప్పుకోవాలి. లేకపోతే, పనిగట్టుకుని ఇలా షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి వ్రాస్తానా!!

 
Clicky Web Analytics