21, ఏప్రిల్ 2012, శనివారం

అంగీకరించగలగడం అనేది ఓ పెద్ద కష్టమైన పని

ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు వ్యంగ్య భావన పుటమరించి ఉంది అని పాఠకుల భావన. వారి దృక్కోణంలో ఆలోచించినప్పుడు నాకు అది నిజముగానే అనిపించింది. వారి భావన యందు దోషం కనబడ లేదు. ఇది నేను అంగీకరించడాని చాలా కష్టపడవలసి వచ్చింది. అదిగో అప్పుడు అనిపించింది, ఏదైనా విషయాన్ని మన మనోభవాలకు విబేధంగా ఉన్నప్పుడు దాని యందు ఉన్న తత్వాన్ని యధా విధిగా అంగీకరించడానికి బదులుగా వ్యతిరేక భావన కలగడం ఎంత సహజమో, అలాగే ఆ విషయాన్ని ఆ విధంగా అంగీకరించి యధాతధంగా స్వీకరించడానికి చాలా మనోబలం కావాలి కూడా అని.

ఇలాంటి ఆత్మా మధనంలోని భావాలకు ఆధ్యం పోసినట్లుగా మఱో ఘటన ఈ మధ్య జరిగింది. ఆ ఘటన గురించి నా భావనను వ్రాసే ముందు ఆ ఘటన లోని విషయాన్ని, అలాగే దానియందు నాకు కలిగిన భావనను ప్రస్తావిస్థాను.

వృత్తి పరంగా పనికి వస్తుందని మఱో సెమినార్ భాగ్యనగరంలో జరుగుతోందని తెలిసిన తరువాత వీలుచేసుకుని హాజరయ్యాను. అక్కడకు వచ్చిన వారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఆ యువతి ఆహార్యం ప్రకారం వివరించాల్సి వస్తే, తల నీలాలకు తైల సంస్కారం లేదు. నీలలను చక్కగా ఒద్దికగా ప్రక్కకి అదిమి పాపిడ తీసి లేవు. ఇక దుస్తులు విషయానికి వస్తే,  తొడలు కనబడేలా ఉండి లోదుస్తులు కనబడే విధంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడుగా, నోటిలోని దంతాలు పచ్చగా ఉండి దుర్ఘందాన్నిస్తున్నాయి. అన్నింటినో మించి ఘాటైన స్ప్రే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ముక్కు పుటాలను అదరగొడుతోంది.

ఇలాంటి యువతులను ఇంతకు పూర్వం చాలా మందిని చూసాను. కానీ ఆ నాడు నాకు కలగని ఆలోచన ఈ నాడు కలిగింది. ఒక్కసారి నా ఆహార్యం గురించి అలాగే అదే సమయంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకున్నాను. తలారా స్నానం చేసి నుదుట వీభూతి ధరించినా, నేను సెమినార్ హాల్ చేరుకునేటప్పటికి నుదురుపై ఉన్న వీభూతి కనబడలేదు. నొసట కుంకుమ ధరించి, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, శరీర దుర్గందం రాకుండా ఉండే విధంగా (నా ఉద్దేశ్యంలో చమట పట్టకుండా..) శ్రద్ద తీసుకుని సెమినార్ జరిగే స్థలానికి చేరుకున్నాను. సెమినార్ జరిగే ప్రదేశం అంతా ఏసీ ఉండటం వల్ల ఎటువంటి వాసన అయినా పసిగెట్టేయ్యవచ్చు.

ఇప్పుడు ఒక ప్రశ్న. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండాలి అని నాకు అనిపించింది, దానికి సవా లక్ష కారణాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే ఆ విదేశీ యువతి ఎందుకు అలా ఉంది? దానికి సమాధానంగా, అలా ఉంటే తాను అందంగా ఉన్నాను అని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఉంటే తాను బాగుంటాను అని ఆ అమ్మాయి మనసు చెప్పి ఉండవచ్చు. అలా ఉంటే ఆ అమ్మాయి మనసు తృప్తి చెందుతుండవచ్చు. అది ఆ అమ్మాయి స్వాతంత్ర్యం. అది ఆ అమ్మాయి అభీష్టం. అది ఆ అమ్మాయి మనో సంకల్పం. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, “రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నట్లు..”, ఆ అమ్మాయి భారత దేశంలో ఉన్నప్పుడు భారతీయ యువతిలా ఉందా అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎక్కడ ఉన్నా నేను నేనులా ఉన్నాను అని ఆ అమ్మాయి ఆ ఆహార్యం చెబుతోంది.

మఱొ అడుగు వేసి, ఒకవేళ ఆ అమ్మాయి

  • ఆహార్యాన్ని నేను ప్రశ్నిస్తే..
  • శరీర తత్వాన్ని నేను ఆక్షేపిస్స్తే ..
  • ప్రవర్తనా విధానన్ని వ్యతిరేకిస్తే ..
  • .. .. ఇంకా ఇంకా  .. .. డాష్ .. డాష్ .. చేస్తే ..

ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రశ్నించ వచ్చు. కానీ కొంచం మర్యాద పూర్వకంగా ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది.

“ .. నువ్వెందుకు అలా ఉండాలి అని అనుకున్నావో నాకు అనవసరం. అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు అనవసరం అని అనక పోయినా, నేను ఇలా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించు .. .. ”

ఆంగ్లంలో వ్రాయాల్సి వస్తే, నాకు ఇలా అనిపించింది.

“.. you decide to be what you are, so the same with me. I decide to be what I’m, so I’m .. .. accept me as I’m .. ”

ఇలాంటి ఆలోచనతో / దృక్పధంతో / ధృకోణంతో ఆలోచిస్తే, ఇంతకు ముందు నేను పాశ్చాత్యులపై వ్రాసిన నా అభిప్రాయాలు నాకు వింతగా అనిపిస్తున్నాయి. వారు ఆవిధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఆ ఆలోచనల గురించి మఱో సారి ..

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

 
Clicky Web Analytics