5, జూన్ 2012, మంగళవారం

సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..

హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!!

మొదటి కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ చాలా పట్టణాలు తిరిగారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులు వీరికి చాలా కష్టాలు చూపించారు. ఈ విషయాన్ని ఆ ప్రేమికులే వారి స్వయం అనుభవాలుగా వివరించారు

రెండొవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కధనం ప్రకారం అబ్బాయి రైల్వే పట్టాల మీద శవమై కనబడ్డాడు. అంటే దీనిని ఆత్మహత్య క్రింద చిత్రీకరించారని సమాజంలోని కొన్ని మహిళా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి న్యాయం జరగాలని పోరాటం జరిపారు. ఈ విషయం అంతా చనిపోయిన అబ్బాయి తల్లి చేత చెప్పించారు.

మూడవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కల్లా ఒక్కటే.. వారిద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి వాటికి తోడుగా అక్కడి పెద్దలు కూడా వీరి వివాహానికి సమ్మతినివ్వలేదు. వాటిని  సమర్దించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ కలసి ఢిల్లీ వెళుతుంటే, దారిలో కాపు కాచి బస్సులో ప్రయాణం చేస్తున్న అబ్బాయిని కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినందుకు అబ్బాయి చెల్లెల్ని కూడా చంపించే ప్రయత్నం చేసారని ఆ అమ్మాయే చెప్పింది. న్యాయస్థానం కొందరు హంతకులను గుర్తించి పలువురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. మఱి కొందరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది.


ఇలాంటి వారిద్దరి కధలే ఈ నాటి చర్చాంశం.

 

సత్యమేవ జయతే గురించి జరిగిన ప్రచారంలో కొన్ని నగ్న సత్యాలు నన్ను చాలా భాదించాయి. అందుకని సత్యాన్ని నగ్నంగా నైనా చూసే ధైర్యం లేని నాలాంటి వాడు మొదటి ఎపిసోడ్ నందలి కొన్ని నిజాలు తెలుసుకున్న తరువాత, నిజాన్ని జీర్ణించుకు లేని స్థితిలో తరువాతి ఎపిసోడ్స్ చూడలేదు.

 

ఆ తరువాత చూసిన మఱో ఎపిసోడ్ ఇది. నేను ఈ ఎపిసోడ్ చూసే సమయానికి ఎంత భాగం అయ్యిందో తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు, ఓ గ్రామ పంచాయితీలోని ఓ ఐదుగురు పెద్దవాళ్లతో చర్చిస్తున్నారు. చర్చ ఎప్పుడూ మంచిదే కాదనను, కానీ చర్చ అనేది ఒక వైపుగా జరగ కూడదు. ఇరువైపులనుంచి జరగాలి. కానీ పంచాయితీ పెద్దలతో ఇక్కడ జరిగిన తతంగం చర్చలా కాకుండా, వారిని అపహాస్యం చేస్తుంటే, ప్రేక్షకులలో కూర్చున్న వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలేమో పరంపర / Tradetion అంటూ ఉంటే, మన అమీర్ ఖాన్ గారేమో భారతదేశ రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారు. వీరి చర్చను పూర్తి చెయ్యకుండానే అమీర్ ఖాన్ గారు మధ్యలో ముగిస్తూ మఱో వ్యక్తిని ప్రవేశ పెట్టారు

 

వీరి తరువాత మఱో వ్యక్తి వచ్చారు. ఆయన లవ్ కమాండోస్ అనే ఓ సమాజానికి ప్రతీకగా వచ్చారు. ఇంటర్ కాస్ట్ మారేజస్ మాత్రమే మన భారత దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతున్నాయని, అవి మాత్రమే భారతదేశ గౌరవాన్ని నిలబెడతాయని సుప్రిం కోర్ట్ చెప్పిందని ఈయన చెబుతున్నారు. ప్రేమ మూర్తులుగా కనబడే దేవతలను ఉదహరింపుగా రాధా శ్రీకృష్ణులను చూపిస్తున్నారు కదా!! అలాంటి వారందరికీ ఓ మాట చెబుతున్నాను, వీలైతే ఆ మూర్తులున్న గుడిలలో పూజలైనా ఆపేయ్యండి లేదా.. ప్రేమియోంక ప్రేమ్ కో స్వీకార్ కర్లో.. love shall conquer the world.. అనేది వీరి భాష్యంలోని ఆఖరి అంశం.

వీటి తరువాత, ఉదాహరణగా మఱో ప్రేమ జంట గురించి ప్రస్తావించారు. అలాగే, ఆ ప్రేమ జంట యొక్క చరిత్రను వివరిస్తూ వారి కుటుంబం వారిని పాతిక సంవత్సారాలు దూరంగా ఉంచిన తరువాత వారికి మఱో సారి సాంప్రదాయ బద్దంగా వారికి వివాహం జరిపించిన వైనాన్ని చిత్రీకరించి ప్రేక్షకులకు సెంటిమెంట్ అందేపరంగా చూపించారు.

ముగింపులోకి వస్తుండగా, ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి తన తండ్రికి సందేశానిస్తూ క్షమించమని వేడుకోవడం దానిని అమీర్ ఖాన్ గారు సమర్దిస్తూ ఆ పిల్ల తల్లి తండ్రులను బుజ్జగించే ప్రయత్నం చేసే పనిగా, ఓ చక్కని పాటని అందించారు.

ఇది అక్కడ జరిగింది. నా అభిప్రాయం మఱో సారి విపులంగా వ్రాస్తాను. ఈ పుటని ఇక్కడతో ముగించి, “సత్యమేవ జయతే ..” లో ఈ ఎపిసోడ్ గురించి నా అభిప్రాయాలు వ్రాసే ముందుగా, ప్రేమ అనే పదం గురించిన నా నిర్వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, నా భావన ఏమిటో .. అది ఏ కోణం నుంచి చూస్తూ వ్రాస్తున్నానో అనే విషయం పై ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది.


ప్రేమ పై నా నిర్వచనం

ప్రేమ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొవిధంగా అభివర్ణిస్తాను. నా భావనలో మాత్రం, ప్రేమ అంటే భాద్యత. మనం ఎవ్వరినైనా ప్రేమిస్తున్నాం అంటే వారి భాద్యత తీసుకున్నట్లే. ఇది భార్యా భర్తల విషయమైనా లేదా తల్లి పిల్లల విషయమైనా లేదా తండ్రి పిల్లల విషయమైనా లేదా మరింకేదైనా. ఆ విధంగా ప్రేమించడం అంటే భాద్యతని భుజాలపై వేసుకుని, ప్రేమించ బడుతున్న వారికి ఒక రకమైన భద్రతా భావనని ఇవ్వటమే అని నా అభిప్రాయం మఱియు అనుభవం.

 
Clicky Web Analytics